Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

సామాన్య ధర్మాలు

మన మతంలో, ఆయా జాతులవారు అనుసరించవలసిన ధర్మాలకు వర్ణాశ్రమ ధర్మాలని పేరు. వర్ణాశ్రమధర్మాలు అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియనిగ్రహం అని మనుస్మృతి చెప్పుతున్నది. వేదోక్తాలైన సామాన్యధర్మాలు మాతృభక్తి. గురుభక్తి. పితృభక్తి. దైవభక్తి.

అహింస యోగసాధనం. యోగమనగా చిత్తవృత్తి నిరోధమని పాతంజలం చెప్పుతున్నది. యోచనలన్నీ చిత్తానికి సంబంధించినవి. పెక్కు విషయాల బరువుమోసేది మనస్సే. ''మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః'' బంధమోక్షములకు కారణంమనస్సే. అది మనంకోరినట్లు ఉండదు. మాట వినే మంచితనం దానికి లేదు. మనకు కావలసిన ఒక విషయాన్ని యోచిస్తుంటే, ఏవిధంగానూ ఉపమోగపడని మరొకవిషయం పైకిపోయి మనస్సు అచట లగ్నమవుతుంది. 'న కించిదపి చింతయేత్‌' 'ఏవిషయమూ నీకక్కరలేదు. దేనిని గూర్చీ చింతించకు'అని చెపితే ససేమిరా ఒప్పుకోదు. చేతకాని పని చెపుతున్నావే అని మనకే బుద్ధిచెప్పుతుంది. అన్నిసమయాల్లోనూ అది మన స్వాధీనములో ఉండక, మనం చెప్పిన మాట వినక, విపరీతపు ఆలోచనలతో ఊరేగుతూ ఉంటుంది. పిచ్చివాడు ఊరికే కూచోడు. ఏదో నోటికివచ్చినరీతిగా వాగుతుంటాడు. మనస్సుయొక్క స్థితిన్నీ అలాటిదే. మనలను వెఱ్ఱివాళ్ళను చేసి తన ఆట తాను ఆడుకుంటుంది.

స్వాధీనమైన మనస్సుసంగతి వేరు. 'ఇది లేదనుకో' అని మనం మనస్సుకు చెప్పామని అనుకోండి. అది అట్లాగే అనుకోవాలి. పులిని చూచి 'ఇది సాధుజంతువు, భయమక్కరలేదు, అని చెప్పామనుకోండి, మనమాట విని మనస్సు చెప్పుచేతలలో వుండాలి. ఏడు అంటే తర్ఫీద్‌ చేయడాన్నే నిరోధం అని అంటారు. మనోనిరోధం అలమడినపిదప మనస్సు మన అజ్ఞకెదురుచూస్తూ తదనుసారంగా నడచుకొంటుంది. ఇట్లామనస్సు నిల్పటం 'తైలధారవత్‌' అని అంటారు. అవిచ్ఛిన్నసంధానంగా వృత్తి ఉండడం. నిజానికి ఈశ్వరదర్శనంకంటె మనోనిగ్రహమే గొప్ప. ఈశ్వరదర్శనంతో కల్గిన ఆనందంలో స్వానుసారియైన మనస్సును 'నిలుకడగావుండి ఆనందించు' అని ఆదేశిస్తే, ఆ మనస్సు ఆనందరసాన్వాదనచేస్తూ కూర్చుంటుంది. స్వామి హృదయానికి ఎంత సన్నిహితుడో, అంతరంగసాధనలున్నూ అంత సన్నిహితాలే. చిత్తవృత్తినిరోధానికై చేసే అంతరంగ సాధనలలో అహింస ఒకటి. మనస్సు స్వాధీనమైన తరువాత మనకు సాధ్యంకాని కార్య ముండదు. ఆస్వతంత్రమనస్కులం అవడంచేతనే మనం ఇంత బలహీనులమై, ఏకార్యంలోనూ దక్షతలేకుండా ఉన్నాం. మనస్సు మదపుటేనుగు వంటిది. మచ్చికచేస్తే మదపుటేనుగు మనకు అన్నిపనులూ ఎలా చేస్తుందో, మచ్చికచేసిన మనస్సుసైతం భృత్యునివలె ఆజ్ఞానుసారం అనువర్తిస్తుంది. మనస్సును జయించిన మహావీరులు కనుకనే విశ్వామిత్ర, ఆంజనేయాదులు మహాకార్యాలు ఆవలీలగా చేయగలిగారు. వారివలె మన మనస్సు స్వాధీనమైతే మనం చేయజాలని పని అంటూ ఉండదు. విక్రమార్కునికి స్వాధీనుడైన బేతాళునివలె వశ##మైన మనస్సుతో ఏపనినైనా అవలీలగా చేసుకోవచ్చు. మనోజయమే యోగం. అహింస దానికొక అంగం. ధర్మశాస్త్రంలో అది సామాన్యధర్మాలలో ఒకటి. యోగశాస్త్రంలో అంగం.

ఒక్కొకపుడు మనమేదయినా ఒకపనిచేస్తే దానికికలిగే ముఖ్యప్రమోజనంతో పాటు మరొక ప్రయోజనం కూడా కల్గుతుంటుంది. మఠానికి వస్తారనుకోండి. ముఖ్యప్రయోజనం పూజ చేయడం, స్వామి దర్శనం. ఇవేకాక అక్కడికివచ్చిన భక్తుల దర్శనమున్నూ, వారితో పరిచయం, లేక పౌరాణికులెవరైనా వచ్చివుంటే వారు చెప్పే పురాణం వినటమున్నూ, ఇవి అనుకోని ప్రయోజనాలు. వీనిని అవాంతరప్రయోజనాలని అంటారు. అహింసా ముఖ్యోద్దేశం చిత్తవృత్తి నిరోధం. దానితోపాటు అవాంతరప్రయోజనమున్నూ కల్గుతుంది.

''అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః''

- యోగసూత్రము.

త్రికరణశుద్ధిగా అహింస సాధించినవారి పరిసరాలలో ఉన్న వారందరూ పరస్పరమూ వైరముడిగి సఖ్యంగా ఉంటారట. చంపవలెనని వచ్చే ఘాతకులు సైతమూ అహింసావ్రతం పాలించే మహాత్ముని ముందు చేష్టదక్కి నిల్చిపోతారట. ఇది అహింసావ్రతంలో అవాంతర ప్రయోజనం. ఇది తానుగా చేకూరుతుంది. బ్రాహ్మణులనుండి సన్యాసాశ్రమం తీసుకొన్నవాళ్లు అహింసను పూర్ణంగాపాటించాలి. ''అహింసన్‌ సర్వభూతా న్యన్యత్ర తీర్థేభ్యః'' అనేమాట సన్యాసులకు ప్రతిజ్ఞ వంటిది. తనవలన ఏప్రాణికిన్నీ భయంలేదని దీని తాత్పర్యము. గృహస్థు స్వధర్మవిషయాలు విడచి తక్కినవాటిలో అహింసను తప్పక పాటించాలి. వేదోక్తాలైన కర్మలతో హింస అంగీకారమే. అందుచే ఆ కర్మలు కాక తతిమ్మా వాటిల్లో అహింసానుష్ఠానం తప్పనిసరి. గౌతమ ధర్మసూత్రాలు అహింసను ప్రస్తావిస్తవి. వేదోక్తకర్మలలో తప్ప తక్కిన వానిలో గృహస్థునికివలెనేసన్యాసికిన్నీ సంపూర్ణంగా అహింసావ్రతం. అందుచేతనే సన్యాసి వంటచేయరాదు, ఆకు గిల్లరాదు.

అహింస తర్వాతి సామాన్యధర్మం సత్యం. 'వాజ్మనసయోరైక రూప్యం సత్యం' అని సత్యలక్షణం. మనస్సున ఉన్నది ఉన్నట్లు చెప్పటమే వాక్ప్రయోజనం. గృహస్థునికి అహింస వలెనే సత్యభాషణకు సైతం రెండు ప్రయోజనాలున్నవి. మనం ఊరివారి తప్పులన్నీ కడు శ్రద్ధతో నేకరువు పెటతాం. 'వీడు ముచ్చు, వాడు చచ్చు' అని ఇట్టి బిరుదులను బాహాటంగా ఇస్తూఉంటాం. మనం చెప్పేది నిజమే ఐయుండవచ్చు. వాజ్మనస్సుల కేకత్వమున్నూ, ఇట్టిమాటలు సత్యభాషణం అని అనిపించుకోదు. ''సత్యం భూతహితం ప్రియం'' సత్యము భూతహితమై ప్రియకరంగా ఉండాలి. మనస్సులో ఉన్నది పైకి చెప్పవలెనని ఆనడం సామాన్యలక్షణం. అందుకని మనస్సులో ఉన్నదంతా అప్రియమయినా ఫరవాలేదని కక్కివేయరాదు. సత్యం సర్వజీవక్షేమకరం కావాలి. కామకారణంగా, క్రోధకారణంగా, హృదయంలోనుండి వాగ్రూపంతో బహిర్గతమయ్యేది సత్యం కాజాలదు. సత్యం ఇతరులకు అగౌరవకారకం కారాదు. వారికి తాపాన్నీ, సంతాపాన్నీ, కల్గించగూడదు. మనకూ, ఇతరులకున్నూ క్షేమాపాదకంగా ఉండాలి. ఏమాటకానీ హితంగా శాంతంగా చెప్పాలి.

సత్యం త్రికరణాలతోచేసేది. ఒకటి వాగ్రూపసత్యం. రెండోది మానసికంగాఆచరించే సత్యవ్రతం. మూడోదికాయికంగా ఆచరించేది. మనం ఒకరోజు స్నానం చేయకపోయినా స్నానం చేసినట్లు నటించడం దైహికంగా చేయబడే అనృతం. సత్యభాషణానికి ముఖ్యప్రయోజనం చిత్తనిరోధం. అవాంతరప్రయోజనం వాక్శుద్ధి. సత్యవ్రతుని వాక్కు రిత్తపోదు. అతడు ఏమిచెప్పినా అది ఫలించవలసినదే. వారి వాక్కులు శాపానుగ్రహదక్షాలు. నిగ్రహానుగ్రహశక్తి అనేదికూడా అదే.

మన సాధన ఎంతవరకు వచ్చినదని పరీక్షించుకోడానికి కలలే గీటురాళ్ళు. 'నాకు డబ్బంటే ఆశ##లేదు' అని జాగ్రదవస్థలో అంటూవుంటాము. ఆమాటనే స్వప్నంలోసహితం అనగలిగితే కాంచనవిజయం కల్గినదనే చెప్పాలి. అట్లే స్వప్నంలో కూడా సత్యభాషణులం కాగలిగితే సత్యం మనకు సిద్ధించినదని చెప్పగలం. అపుడు మనం ఏదిచెప్పితే అదే కొనసాగుతుంది.

''సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్‌''

- యోగసూత్రములు.

ఐతే అవాంతరప్రయోజనాన్ని ఉద్దేశించి మనం సత్యవ్రతం అనుష్టించరాదు. సత్యం సత్యాన్వేషణకోసమే చేయాలి.

అంతరంగసాధనాలలో వైరాగ్యం ఒకటి. ఆశ##లేకుండా పోవడమే వైరాగ్యం. శాస్త్రం వైరాగ్యాన్ని గూర్చి చాలా బలంగా చెప్పింది. విరాగికండ్లకు నిధులు గోచరిస్తవిట. 'నేను ఎన్నోఏండ్లుగా వైరాగ్యాన్ని అవలంబించినాను. ఒక్కనిధికూడా నాకండ్లుకు కనపడలేదు' అని ఏవరైనా అంటే, అతనివైరాగ్యమెటువంటిదో సులభంగా తెలిసిపోతుంది. అది నిజమైన వైరాగ్యం కాదు. అవాంతరప్రయోజనంపై గల ఆసక్తే.

అస్తేయమంటే దొంగిలించకుండా ఉండటం. అన్యాయమైన ఆశలు ఉండరాదు. ఇతరుల డబ్బును, ఆస్తిని దొంగిలించరాదు. దొంగదస్తావేజులపై సంతకాలుచేసి ఆస్తులను కాజేయటమంత అన్యాయం వేరొకటి ఉంటుందా!

శారీరకశౌచం మనశ్శుద్ధి కలిగిస్తుంది. డెబ్బది, ఎనుబది ఏండ్లుగా దేశంలో శౌచం చాలాతగ్గిపోయింది. శౌచవిధులను ధర్మశాస్త్రాలు పేర్కొంటవి. మనదేహం ఎట్లాశుద్ధంచేయాలి. ఏ ఏ పదార్థాలు వాడుకోవాలి - అనే ఈ విషయాలు శాస్త్రాలు చెపుతవి. శౌచం మనోనిగ్రహం కలిగిస్తుంది. ఇది అందరున్నూ ఆచరించవలసిన ధర్మం. చదివి ఊరుకుంటే ప్రయోజనంలేదు. చేయాలి. మంచినీళ్ళు త్రాగటానికి తలా ఒక చెంబో ఉండాలి. వానిని తామే శుద్ధిచేసికోవాలి. ఏ ఏ లోహానికి శుద్ధినిమిత్తం ఏఏ పదార్థం వాడాలో శాస్త్రం విధించిఉన్నది. ఎక్కడికివెళ్ళినా ఎవరుతాగే పాత్ర వారు తీసికొని వెళ్ళుతూ ఉండాలి. ఇతరుల పాత్రలు వాడరాదు. ఇవి అన్ని జాతులవారూ పాటించవలసిన విధులు.

ఇంద్రియనిగ్రహం కడపటిది. ఇంద్రియాలను స్వేచ్ఛగా వదలరాదు. ఒక్కొక్కింద్రియానికిన్నీ ఆహారనియతి ఉండాలి. నియతిని అతిక్రమించరాదు. అట్లు ఎపుడైనా అతిక్రమం జరిగినా తిరిగి పొరపాటు జరగనీయరాదు. అట్టిశక్తి అలవరచుకోవాలి. ఈ ఐదు సామాన్యధర్మాలూ వైదికమతాన్నీ, ఆస్తికమతాన్ని అనుసరించే అందరూ పాటించవలసినవి. అందుచే ఇవి అందరూ అనుష్ఠించతగ్గవి.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page